NTV Telugu Site icon

Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!

Sanju Samson

Sanju Samson

Sanju Samson About Test Cricket: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. 40 బంతుల్లోనే శతకం చేసి.. టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సూపర్ సెంచరీ చేసిన సంజూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోళ్లను మూయించిన సంజూ.. తాజాగా తన మనసులోని మాటను వెల్లడించాడు. తనకు టెస్టుల్లోనూ ఆడాలని ఉందని వెల్లడించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ తనను టెస్టుల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు తెలిపాడు. ‘నేను టెస్టుల్లో కూడా రాణించగలననే నమ్మకం ఉంది. కేవలం టీ20, వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలనే ఉద్దేశం నాకు లేదు. భారత్ తరఫున టెస్టు క్రికెట్‌ కూడా ఆడాలనుంది. దులీప్‌ ట్రోఫీకి ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి సందేశం వచ్చింది. నన్ను కూడా టెస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మరిన్ని రంజీ మ్యాచ్‌లను ఆడమని సూచించారు. నేను తప్పకుండా టెస్టుల్లో ఆడుతా’ అని సంజూ ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు.. స్పందించిన బీసీసీఐ వర్గాలు!

అయితే సంజూ శాంసన్ టెస్టుల్లో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే జట్టులో తీవ్ర పోటీ ఉంది. సత్తాచాటిన ఆటగాళ్లకే తుది జట్టులో స్థానం దక్కడం లేదు. ఇందుకు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్ లాంటి వారు నిదర్శనం. మరి సంజూ టెస్టుల్లో ఎప్పుడు అరంగేట్రం చేస్తాడో చూడాలి. భారత్ తరపున 33 టీ20లు, 16 వన్డేలు ఆడిన అతడు 1100 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మాత్రం మనోడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 168 మ్యాచ్‌లలో 4419 రన్స్ చేశాడు.