Site icon NTV Telugu

Sanjay Dutt: పొలిటికల్ ఎంట్రీపై సంజయ్‌ దత్‌ ఏమన్నారంటే..!

Clerty

Clerty

సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆయా పార్టీలు కూడా సీట్లు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌ హ్యాసనటుడు గోవింద్ కూడా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని తెలిసింది. గతంలో 2004 నుంచి 2009 వరకు ఎంపీగా పని చేశారు. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలీవుడు భామలు కంగనా రనౌత్, నవనీత్ కౌర్‌లు బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కంగనా హిమాచల్‌ప్రదేశ్ నుంచి మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నవనీత్ కౌర్ అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా రాజకీయల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంజయ్ దత్ స్పష్టం చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తానే ప్రకటిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తాననే వదంతులకు స్వస్తి పలకాలని కోరారు. ఏ పార్టీలోనూ చేరడం లేదని.. దయచేసి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని కర్నాల్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు పోటీగా సంజయ్‌ను బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతున్నట్లు కొంతకాలంగా ఊహగానాలు వచ్చాయి. ఈ వదంతులపై తాజాగా సంజయ్‌ దత్ సమాధానం ఇచ్చేశారు.

సంజయ్‌దత్‌పై గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు సంజయ్‌ రాజకీయాల్లో వస్తున్నారని వ్యాఖ్యానించారు. స్పందించిన సంజయ్‌ అప్పుడూ ఇదే సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆయన తండ్రి సునీల్‌దత్‌ గతంలో కాంగ్రెస్‌ ఎంపీగా పని చేశారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన సోదరి ప్రియాదత్‌ సైతం కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారు. ఇక 1993 ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్‌ దోషిగా తేలారు. నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 2016లో జైలు నుంచి విడుదలయ్యారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

 

Exit mobile version