Site icon NTV Telugu

Sandeshkhali: రాష్ట్రపతిని కలిసిన సందేశ్‌ఖాలీ బాధితులు.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!

Murmu

Murmu

సందేశ్‌ఖాలీ బాధితులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బాధితులు కలిసి తమ ఆవేదనను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సందేశ్‌ఖాలీలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సమాజాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని బాధితులు కోరారు.

ఎస్సీ, ఎస్టీ సపోర్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పార్థ బిస్వాస్‌తో కలిసి సందేశ్‌ఖాలీ బాధితులైన మహిళలు రాష్ట్రపతిని కలిశారు. బాధితులు ముర్ముకు మెమోరాండం సమర్పించినట్లు పార్థ బిస్వాస్ తెలిపారు.

రాష్ట్రపతి చాలా సానుభూతితో బాధితుల ఆవేదనను తెలుసుకున్నారని పార్థ బిస్వాస్ పేర్కొన్నారు. విషయం తెలుసుకుని ముర్ము చాలా బాధపడ్డారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఢిల్లీకి వచ్చారని చెప్పుకొచ్చారు.

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఉన్న బీద కుటుంబాలను రక్షించడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు లేఖలో పేర్కొన్నారు. తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్లు రాష్ట్రపతికి అందజేసిన మెమోరాండంలో పేర్కొన్నారు.

గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ ప్రాంతం ఆందోళనలతో అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని అనుచరులు భూకబ్జా, లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా నిరసనలు చేపట్టారు.

షాజహాన్‌ను ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కాపాడుతున్నారంటూ పెద్ద ఎత్తన విమర్శలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక హైకోర్టు జోక్యంతో నిందితుడు షాజహాన్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మోడీని బాధిత మహిళలు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన చెందారు. దీంతో వారి బాధలు విని కలత చెందారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి మొర్ర పెట్టుకున్నారు. న్యాయం చేస్తానని ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.

 

Exit mobile version