స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ప్రముఖ కంపెనీలు శాంసంగ్, షియోమీ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఖరీదైన ఫోన్ల ధరలు పెరగగా, ఇప్పుడు సామాన్యులు వాడే బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్ల ధరలను కూడా ఈ రెండు సంస్థలు భారీగా పెంచేశాయి. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. రెండు కంపెనీలు కలిపి మొత్తం 41 రకాల ఫోన్ వేరియంట్ల ధరలను సవరించాయి. దీనివల్ల మోడల్, స్టోరేజ్‌ను బట్టి వినియోగదారులపై రూ. 1,000 నుంచి రూ. 4,000 వరకు అదనపు భారం పడనుంది. మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ ఏ (A), ఎఫ్ (F) సిరీస్‌లలోని 22 వేరియంట్ల ధరలను పెంచింది. గెలాక్సీ A07 5G ప్రారంభ ధర రూ. 20,999 నుంచి రూ. 22,999కి చేరింది. గెలాక్సీ F17 5G అన్ని మోడళ్లపై రూ. 2,000 పెరగగా, గెలాక్సీ A17 5G ప్రారంభ ధర రూ. 29,999గా మారింది. గెలాక్సీ A57 ఫోన్‌పై అత్యధికంగా రూ. 4,000 పెరగడంతో, దీని ధర రూ. 66,999 నుంచి రూ. 76,499 మధ్యకు చేరింది. అలాగే గెలాక్సీ A36, A56, A37 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి.
మరోవైపు.. షియోమీ తన రెడ్‌మీ (Redmi) పోర్ట్‌ఫోలియోలోని 19 ఫోన్ల ధరలను పెంచింది. రెడ్‌మీ A7 ధర రూ. 14,999కి, రెడ్‌మీ A7 ప్రో ధర రూ. 15,999కి పెరిగాయి. రెడ్‌మీ 15A, 17C, 17 మోడళ్లపై కూడా రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు భారం పడింది. ఇక రెడ్‌మీ నోట్ 17 5G ప్రారంభ ధర రూ. 30,999కి చేరగా, రెడ్‌మీ నోట్ 17 ప్రో 5G మోడళ్లపై ఏకంగా రూ. 4,000 పెరిగింది. రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్, టర్బో 5 మోడళ్లు కూడా ప్రియమయ్యాయి. రానున్న వారం రోజుల్లో వివో, ఒప్పో, మోటరోలా, రియల్‌మీ కంపెనీలు కూడా ఫోన్ల ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

