NTV Telugu Site icon

Samsung Mobile Alert: మీరు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా?.. అప్‌డేట్‌ తప్పనిసరి!

Samsung Mobile Alert

Samsung Mobile Alert

Samsung users to update their smartphones: మీరు ‘శాంసంగ్‌’ స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా?.. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఓ అలర్ట్‌ జారీ చేసింది. శాంసంగ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌లో భద్రతాపరమైన లోపం ఉందని, వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్‌-ఇన్‌) సూచించింది.

నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం పొంచి ఉంది. లోపాలను గుర్తించి చొరబడితే.. డివైజ్‌ పిన్‌ను, ఏఆర్‌ ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను అటాకర్లు రీడ్‌ చేయగలరని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేయగలరని.. అర్బిట్రరీ ఫైల్స్‌, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది.

Also Read: Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!

శాంసంగ్‌ లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌లు అయిన గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14లలో లోపం ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్లి.. లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు ఫోన్‌ అప్‌డేట్ చేసుకోవాలని టెక్‌ నిపుణులు అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను అస్సలు క్లిక్‌ చేయొద్దని సూచిస్తున్నారు.