EX MLA Samineni Udayabhanu on Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 13న ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావును అందరూ గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సినీ రంగానికి కోట చేసిన సేవలను ప్రశంసించారు. కోట శ్రీనివాసరావు గురించి ఓ ఆసక్తికర విషయంను పంచుకున్నారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకి హోటల్ ఐలాపురంలో సంతాప సభ ఏర్పాటు చేశారు.
కోట శ్రీనివాసరావు హీరోగా రావాలనుకున్నారని, అప్పటికే ఆయనకు 40 సంవత్సరాలు దాటడంతో కుదరలేదని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సంతాప సభలో తెలిపారు. ఈరోజు విజయవాడలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ… ‘కోట శ్రీనివాసరావు గారు ఈ పక్కనే ఉన్న కంకిపాడులో జన్మించారు. నాటక రంగంలో బాగా రాణించిన వ్యక్తి. 1978లో సినీ రంగంలో ప్రవేశించారు. సుమారు 40 సంవత్సరాలు పాటు చలనచిత్ర రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నటించారు. కోట గారు హీరోగా రావాలనుకున్నారు. 40 సంవత్సరాలు దాటింది కాబట్టి 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో వెండితెర మీద కనిపించారు’ అని చెప్పారు.
Also Read: Prasanna Kumar Reddy: నేను కాదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు!
‘తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో కోట శ్రీనివాసరావు సుమారు 750 చిత్రాల్లో నటించారు. విలన్ పాత్రకు నిజంగానే ప్రాణం పోసేవారు. కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం. కోట గారి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా జరిగిందంటే.. ఆయన కుమారుడిని కోల్పోవడం. పలుమార్లు చాలా మందితో ఆయన చర్చించిన అంశం ఏదైనా ఉంది అంటే.. తన కుమారుడు అకాల మరణం గురించి మాత్రమే’ అని సామినేని ఉదయభాను తెలిపారు. కోట కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కోట కెరీర్ ఆరంభంలో సహాయనటుడు, ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
