టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ ఇంతకు ముందులాగా వరుస సినిమాల్లో కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. కానీ సామ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది . తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.‘‘చాలా పాత్రల్లో ప్రాధాన్యత లేకపోయినా నేను నటించాను. ఎందుకంటే ప్రతీ పోస్టర్ పై నేను ఉండాలని అనుకున్నాను కాబట్టి. అనుకున్నట్టే ఉన్నాను. ప్రతీ నెల నాకొక సినిమా రిలీజ్ ఉండేది. అలాంటప్పుడు మీరు నన్ను పట్టించుకోకుండా ఉండలేరు.
అందరూ ప్రతీ నటిలో ఒక ఆలోచనను క్రియేట్ చేస్తారు. హీరోయిన్ అంటే కెరీర్ లైఫ్ తక్కువగా ఉంటుందని ఫిక్స్ అయిపోయేలా చేస్తారు. ఎక్కువగా బ్రేక్స్ తీసుకోలేమని అంటారు, కంటికి కనిపించకపోతే ప్రేక్షకులు మమ్మల్ని మర్చిపోతారని అంటారు’’ అంటూ ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన రోజులను గుర్తుచేసుకొని, అందులో అన్నీ తనకు నచ్చి చేయలేదని తెలిపింది సమంత.‘‘ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను మంచి ప్రాజెక్ట్ వచ్చేవరకు ఎదురుచూస్తాను, సంవత్సరం పాటు బ్రేక్ తీసుకున్నాను అని చెప్పడం సులభమే. కానీ ప్రేక్షకుల కంటికి కనిపించకపోతే నన్ను మర్చిపోతారేమో అన్న భయం నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను ప్రస్తుతం ఎక్కువ నిలకడగా ఉండడం లేదు. అయినా నేను ఈ భయాన్ని అధిగమించాలి. నేను పాత వార్తను అయిపోతానేమో అనే భయం వదిలేయాలి. మంచి రోల్ వచ్చే వరకు ఎదురుచూడాలి. ప్రేక్షకుల ఎదురుచూపులకు పూర్తి న్యాయం చేశానని అనిపించాలి. అన్ని అవకాశాలు నా ఎదురుగా వచ్చేవరకు ఎదురుచూస్తాను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..