మన తెలుగు రాష్ట్రాల్లో నూనెల కోసం పండిస్తున్న పంటలలో కుసుమ కూడా ఒకటి.. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతుంది ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం, మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి ఈ పంట సాగు తగ్గుతూ వస్తుంది.. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అయితే కుసుమను సాగుచేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ పంట సాగుకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మంచి సమయం.. రకాన్నిబట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135రోజుల వరకు వుంటుంది. గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది..ఈ పంట వేసుకోవడం కోసం ముందుగా నేలను పరీక్షించాలి. తేమను నిల్పుకోనే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్ర గరప నేలలు ఈ పంట సాగుకు మిక్కిలి అనుకూలం. మ్యాజేరియం ఎండుతెగులు ఎక్కువగా ఆశించే అవకాశం వున్నందున ఆమ్లత్వం గల భూములు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుసుమ పంట తట్టుకుంటుంది.. నేలను దున్నేదాన్ని బట్టి దిగుబడి కూడా పెరుగుతుంది..
ఇక నేలను బట్టి నీటితడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది..బరువైన నేలలో కుసుమ పంట వేసినప్పుడు అంత ఎక్కువగా నీళ్ళు పెట్టవలసిన అవసరం లేదు.. రెండు నీటి తడులు అవసరం.నేలల్లో తేమను బట్టి కుసుమలో పూత 65 నుండి 75 రోజులకు వస్తుంది. వర్షాభావ పరిస్థితులలో కీలక దశలయినటువంటి కాండం సాగే దశ (30-35 రోజులలో) లేక పూతదశ (65 నుండి 75 రోజులకు) లలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది..
ఇక విత్తనాలను విత్తిన తర్వాత 20 నుంచి 30 రోజు ఒకసారి కలుపు తీసుకోవాలి.భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.. అప్పుడే కలుపు సమస్య తగ్గి అధిక దిగుబడులను పొందడానికి వీలు ఉంటుంది..