Sachin Shares First Memory Of Watching Root: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ హవా నడుస్తోంది. ఈతరం ఫాబ్ ఫోర్‌లో మిగతా ముగ్గురు (విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్) తడబడినా.. రూట్ మాత్రం పరుగుల వరద పారించాడు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆపై ఊహించని రీతిలో ఊపందుకుంది. ఈ 4-5 ఏళ్లలో ఏకంగా 22 టెస్ట్ శతకాలు బాదాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డుకు దగ్గరగా వెళ్తున్నాడు. ప్రస్తుతం టెస్ట్‌ల్లో రూట్ ముందున్న లక్ష్యం సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించడమే.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 మ్యాచ్‌ల్లో 15921 పరుగులతో టెస్ట్ కెరీర్‌ను ముగించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 248 నాటౌట్. జో రూట్ ఇప్పటికే 158 టెస్ట్‌ల్లో 13543 పరుగులు చేశాడు. ఇందులో 39 శతకాలు, 68 అర్ధ శతకాలు ఉన్నాయి. రూట్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 262. రూట్ వయసు ఇప్పుడు 34. ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రాబోయే కొన్ని సంవత్సరాలలో టెస్ట్ క్రికెట్‌లో కొనసాగగలడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Also Read: Mirabai Chanu: గోల్డ్ మెడల్ కొట్టిన మీరాబాయి చాను!
రెడిట్లో తన అభిమానులతో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. టెస్ట్‌లలో జో రూట్ 13000 పరుగుల మార్కును అధిగమించడంపై స్పందించాడు. ‘జో రూట్ టెస్ట్‌ల్లో 13000 పరుగులు దాటడం అద్భుతం. అతను ఇప్పటికీ బలంగా ఉన్నాడు. 2012లో తన తొలి టెస్ట్ సందర్భంగా నాగ్‌పూర్‌లో నేను అతనిని మొదటిసారి చూశా. ఇంగ్లండ్ భవిష్యత్ కెప్టెన్‌ను మనం చూస్తున్నామని నా సహచరులతో చెప్పాను. రూట్ వికెట్‌ను అంచనా వేయగలగడం, స్ట్రైక్‌ను రొటేట్ చేసే విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే అతడు పెద్ద ప్లేయర్ అవుతాడని నాకు తెలుసు’ అని సచిన్ చెప్పాడు. సచిన్ రికార్డును అధిగమించడానికి రూట్ ఇంకా 2379 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ నవంబర్ 2013లో రిటైర్ అయ్యాడు. ఎన్నో ఏళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. మరి రూట్ ఆ రికార్డు బద్దలు కొడతాడేమో చూడాలి.
