Site icon NTV Telugu

Sabitha Indra Reddy : ఈ నెల 6 ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం

Cm Breakfast

Cm Breakfast

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను ఈ నెల 6 న (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని తెలిపారు.

మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించి పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుతీరును పర్యవేక్షించే భాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నామని తెలిపారు. విద్యా శాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అల్ఫాహారాన్ని అందించనున్నామని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపవుట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి చదువు పట్ల శ్రద్ధ కలిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

దీన్ని అమలు చేయడం ద్వారా 27 ,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 672 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందజేయడం జరుగుతున్నదని, సన్న బియ్యం కోసం 187 కోట్లు, గుడ్ల కోసం 120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తున్నదని తెలిపారు.

దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని 1 నుంచి 8 వ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం 9 , 10 తరగతి విద్యార్థులకు కూడా అందజేస్తున్నామని, ఇందుకోసం అదనంగా 137 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఐరన్ , సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 32 కోట్లు వెచ్చించి రాగి జావను అందించడం జరుగుతున్నదని తెలిపారు. అల్పాహార నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.

Exit mobile version