Site icon NTV Telugu

SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!

Sa Vs Ind Women (1)

Sa Vs Ind Women (1)

SA vs IND Women: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత మహిళల జట్టు విజయం సాధించింది. జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళలపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ లో భారత్ మూడు ఓటమిల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 43 పరుగులతో భారత్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 పరుగులు చేసి సహకరించగా, చివర్లో దీప్తి శర్మ 36 నాటౌట్, రిచా ఘోష్ 34 నాటౌట్ వేగంగా పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లో ఎలీజ్-మరి మార్క్స్, కేలా రెయినీకేలు చెరో రెండు వికెట్లను తీసుకున్నారు.

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత సునే లూస్ (40), టాజ్మిన్ బ్రిట్స్ (30) పరుగులతో పోరాటం చేశారు. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది. దీప్తి శర్మ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. టీమిండియా ఇతర బౌలర్లలో క్రాంతి గౌడ్, శ్రీ చరణి, కశ్వీ గౌతమ్ తలో వికెట్ తీసి సహకరించారు. చివరికి దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 171/9 వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు సిరీస్ ను 3-1కి చేర్చింది.

Exit mobile version