NTV Telugu Site icon

VVS Laxman: సూర్య సూపర్.. ఆ ఇద్దరికి ఎదురేలేదు: లక్ష్మణ్‌

Vvs Laxman

Vvs Laxman

దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడని టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. సిరీస్‌ ఆసాంతం కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల తాను గర్వపడుతున్నా అని చెప్పారు. జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం అద్భుతం అని హైదరాబాద్ సొగసరి చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌తో బిజీగా ఉండడంతో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ కోసం తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

టీ20 సిరీస్‌ అనంతరం వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ ఆసాంతం భారత కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల గర్వపడుతున్నా. 3-1తో విజయం ఓ ప్రత్యేక కృషి. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ జట్టును అద్భుతంగా నడిపించాడు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, తిలక్‌ వర్మకు ఎదురేలేదు. బంతితో వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. భారత జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం చూసి సంతోషంగా ఉంది. ఈ చిరస్మరణీయ విజయానికి అభినందనలు’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

‘టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. అందరికీ నా అభినందనలు. విదేశాల్లో సిరీస్‌ గెలవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. గత పర్యటనలో సిరీస్‌ను 1-1తో ముగించాం. ఈ సారి సిరీస్‌ కైవసం చేసుకున్నాం. 2-1తో ఆధిక్యంలో ఉన్నా.. చివరి మ్యాచ్‌ను దూకుడుగానే ఆడాలనుకున్నాం. అందరూ రాణించడం సంతోషం. ఈ సక్సెస్ క్రెడిట్ అందరికీ దక్కుతుంది. సిరీస్‌ను జట్టుగా గెలుచుకున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నా. ఈ సిరీస్‌ నుంచి మేం పాఠాలూ నేర్చుకున్నాం. ఇక దేశవాళీ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్న అందరికీ అభినందనలు. నేనూ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడబోతున్నా’ అని సూర్యకుమార్‌ తెలిపాడు.