NTV Telugu Site icon

SA vs IND: 125 టార్గెట్‌ను కాపాడుకోవడం కష్టమే.. మా కుర్రాళ్లు అద్భుతం: సూర్య

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Speech

టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ అన్నాడు. దక్షిణాఫ్రికాపై రెండో టీ20లో తమ కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ప్రశంసించాడు. ఓ దశలో గెలిచేలా కనిపించినా.. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదన్నాడు. మూడో టీ20 జరిగే జోహెన్నెస్‌ బర్గ్‌లో మరింత ఎంటర్‌టైర్‌మెంట్‌ ఖాయం అని సూర్య చెప్పాడు. ఆదివారం గెబేహా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ టీమ్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్ మాట్లాడుతూ… ‘ఏ మ్యాచ్‌లో అయినా టార్గెట్‌ను ఎంత ఉంచినా.. దాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించాలి. టీ20ల్లో 125, 140 స్కోర్లను కాపాడుకోవడం చాలా కష్టం. ఇది అందరికీ తెలిసిన విషయమే. టార్గెట్‌ తక్కువగా ఉన్నా మా కుర్రాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఓ దశలో మేం గెలిచేలా కనిపించినా లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఓటమి తప్పలేదు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతం. అతడు గత కొన్నేళ్లుగా చాలా శ్రమిస్తున్నాడు. ఈ ప్రదర్శనకు అదే కారణం. ప్రతి ఒక్కరం వరుణ్ బౌలింగ్‌ను ఆస్వాదించాం. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. తప్పకుండా మేం సిరీస్‌ను సాధిస్తాం. మూడో టీ20 మ్యాచ్‌ జోహెన్నెస్‌ బర్గ్‌లో జరగనుంది. అక్కడ మరింత ఎంటర్‌టైర్‌మెంట్‌ పక్కా’ అని తెలిపాడు.

Also Read: Koti Deepotsavam 2024: ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (20; 20 బంతుల్లో 1×4, 1×6), అక్షర్‌ పటేల్‌ (27; 21 బంతుల్లో 4×4), హార్దిక్‌ పాండ్యా (39 నాటౌట్‌; 45 బంతుల్లో 4×4, 1×6) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (47 నాటౌట్‌; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. భారత స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి (5/17) అద్భుత బౌలింగ్‌ చేశాడు.