Meghana Retirement: బిగ్ షాక్.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియన్ ప్లేయర్..

Retirements

Retirements

భారత మహిళా క్రికెటర్ S మేఘన (సబ్బినేని మేఘన) 30 ఏళ్ల వయసులోనే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఇన్నాళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న మేఘన, ఇకపై ఆటగాడిగా మైదానంలోకి దిగబోనని స్పష్టం చేశారు.

ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. “ఆటగాడిగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. క్రికెట్ మైదానం నాకు రెండో ఇల్లు లాంటిది. ఓర్పు, వినయం నేర్పడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలను, మంచి స్నేహితులను నాకు అందించింది. ఆటగాడిగా నా ప్రయాణం ముగిసినప్పటికీ, క్రికెట్‌తో నా బంధం ఎప్పటికీ తెగిపోదు. రాబోయే తరాల ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తూ, నాకు ఎంతో ఇచ్చిన ఈ ఆటకు తిరిగి నా వంతు సేవ చేస్తాను” అని తెలిపారు.

విజయవాడకు చెందిన మేఘన 2016 నవంబరులో వెస్టిండీస్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశారు. భారత జట్టు తరఫున ఆమె 3 వన్డేలు, 17 టీ20 మ్యాచులు ఆడారు. అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 114 పరుగులు, టీ20ల్లో 258 పరుగులు చేశారు. రెండు ఫార్మాట్లలోనూ రెండు హాఫ్ సెంచరీలు సాధించారు. 2022 తర్వాత ఆమెకు భారత జట్టులో చోటు దక్కలేదు.

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లీగ్‌లోనూ మేఘన కీలక పాత్ర పోషించారు. మూడు సీజన్లలో కలిపి 15 మ్యాచులు ఆడి 302 పరుగులు చేశారు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 2023 లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన ఆమె, 2024 , 2025 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.