Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!

Ycp Rythu Shankaravam

Ycp Rythu Shankaravam

Rythu Shankaravam in Nandyal, Kurnool: నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ‘రైతు శంఖారావం’ కార్యక్రమానికి వెళ్లకుండా పలువురు వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. రహదారులపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నంద్యాల మండలం కొత్తపల్లె వద్ద ఎమ్మెల్సీ ఇషాక్ బాషాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, సీఐ ఈశ్వరయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతు శంఖారావం కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించాలని ఎమ్మెల్సీ కోరినా.. ప్రస్తుతం వెళ్లేందుకు అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఇషాక్ బాషాను వెనక్కి పంపించారు.

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రైతు శంఖారావం కార్యక్రమానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి రోడ్డుపైకి వచ్చి ట్రాక్టర్లతో రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. రైతు శంఖారావానికి వెళ్లకుండా ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఒక్క వాహనంలోనే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గంగుల పోలీసులను కోరారు. రైతు శంఖారావం కార్యక్రమానికి వెళ్లకుండా ఉండేందుకు ముందుగానే నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో గంగుల, పోలీసుల మధ్య వాగ్వాద వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గంగుల బ్రిజేంద్ర రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీశైలం డ్యాంలో నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వెలుగోడు రిజర్వాయర్‌ను నింపకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రశ్నించేందుకు వెలుగోడుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. రైతుల కోసం ఆందోళన చేపట్టకుండా వైసీపీ నేతలను అడ్డుకుంటూ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందరినీ అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం ద్వారా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.