NTV Telugu Site icon

Russia-Ukraine War: రష్యా సైన్యమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ దాడులు.. 50 మంది మృతి

Ukraine

Ukraine

Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో 50 మంది రష్యన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. 3 యుద్ధ ట్యాంకులు, మాస్టా-ఎస్‌ యుద్ధ ట్యాంకులు, 11 సాయుధ వాహనాలను ఉక్రెయిన్‌ దళాలు ధ్వంసం చేశారు. ఫ్రంట్‌లైన్‌లో గురువారం ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ ఆపరేషనల్‌ కమాండర్‌ ఒకరు తెలిపారు.

ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇప్పటివరకూ.. 2 లక్షల మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రెండు దేశాలూ చెరో లక్షమంది వరకు సైనికులను కోల్పోయినట్లు అమెరికా అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌లో మరో 40 వేల మంది పౌరులు మృత్యువాత పడి ఉంటారని పేర్కొంది. ఇకనైనా రెండు దేశాలు పంతాన్ని వీడి.. శాంతి చర్చలకు సిద్ధం కావాలని సూచించింది. ఆ రెండు దేశాల్లో ఒక్కొక్క దానినుంచి లక్షమంది చొప్పున ఉండవచ్చని అమెరికా ‘జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ప్రకటించారు. మృతుల్లో మరో 40,000 మంది ఉక్రెయిన్‌ పౌరులు ఉండవచ్చన్నారు. రాబోయేది శీతాకాలం కావున ఇరుదేశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో సైనిక విజయం సాధ్యం కాదన్నారు. ఇరుదేశాలతో చర్చలతో ఒక అభిప్రాయానికి రావాలని ఆయన సూచించారు.

రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమేననీ, కొన్ని షరతులకు అంగీకరిస్తే చాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఆక్రమించుకున్న ప్రాంతాలను రష్యా తమకు తిరిగి అప్పగించాలని, యుద్ధం వల్ల కలిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుద్ధ నేరాలపై విచారణను రష్యా ఎదుర్కోవాలంటూ మరో షరతు విధించారు. రష్యా కూడా ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని చెబుతోంది. ఖేర్సన్‌ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన రష్యా.. ఆ మేరకు కార్యాచరణ మొదలైందని వెల్లడించింది. ఖేర్సన్‌లో పెద్దఎత్తున మందుపాతరలను రష్యా అమర్చిందనీ, దానిని మృత్యు నగరంగా మార్చాలనుకుంటోందని ఉక్రెయిన్‌ అనుమానిస్తోంది. రష్యా సైనికులు ప్రశాంతంగా వెనుదిరిగేందుకు ఉక్రెయిన్‌ అవకాశం కల్పిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఆగ్నేయాసియా దేశాలతో ఉక్రెయిన్‌ గురువారం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది.

World Most beautiful Cop: మోడల్‌గా మారడానికి పోలీసు ఉద్యోగాన్ని వదిలిపెట్టను..

మరోవైపు ఉక్రెయిన్‌కు మరో 40 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,280 కోట్లు) విలువైన సైనిక సాయాన్ని అందించాలని అమెరికా నిర్ణయించింది. కొత్తగా 40 కోట్ల డాలర్ల భద్రతా సహాయ ప్యాకేజీలో భాగంగా అమెరికా ఉక్రెయిన్‌కు వాయు రక్షణ వ్యవస్థలు, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను అందజేస్తుందని పెంటగాన్ గురువారం ప్రకటించింది. ప్యాకేజీలో నాలుగు స్వల్ప-శ్రేణి, అత్యంత మొబైల్ అవెంజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరిలో రష్యా దళాలు దాడి చేసినప్పటి నుంచి అమెరికా ఉక్రెయిన్‌కు మొత్తం 18.6 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసింది. యుద్ధాన్ని ముగించడంపై చర్చలకు అవకాశం ఉందని, రష్యా లేదా ఉక్రెయిన్‌కు సైనిక విజయం సాధ్యం కాదని మార్క్‌ మిల్లే చెప్పారు. రష్యా తన బలగాలు ఉక్రెయిన్ దక్షిణ నగరమైన ఖేర్సన్ నుండి తిరోగమనం ప్రారంభించాయని గురువారం ప్రకటించింది.

Show comments