Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి పుతిన్ భారత్ రాబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్‌ని భారత్ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు పుతిన్ త్వరలో భారత్ వస్తున్నట్లు ఆ దేశ మంత్రి గురువారం ధ్రువీకరించారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, పుతిన్ తొలిసారిగా భారత్ సందర్శించనున్నారు.
Read Also: 10th Exam Paper Leak: కేటీఆర్‌పై కేసులు పెట్టడం ఏంటి.. లీకేజీకి కారకులెవ్వరు?: ఆర్‌ఎస్ ప్రవీణ్
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. పుతిన్ భారత పర్యటన కోసం సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, ఎలాంటి నిర్దిష్టమైన తేదీ ఇవ్వలేదు. అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని పర్యటన ఆహ్వానాన్ని అంగీకరించారని ఆయన చెప్పారు. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, తన తొలి పర్యటన కోసం రష్యాను ఎంచుకున్నారని, ఇప్పుడు తమ మంతు అని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించిన అతికొద్ది మంది నాయకుల్లో మోడీ ఒకరు. గతేడాది మోడీ రష్యా పర్యటనలో పుతిన్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఇరువురు నాయకులు హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. మోడీ, పుతిన్ టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.