NTV Telugu Site icon

Uttar Pradesh: ఓ యువకుడి ఖాతాలో రూ.9,900 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే?

Bank Accounts

Bank Accounts

మీరు నిద్రలేచి చూసేసరికి మీ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది. మీరు ఒక్కసారి ఉత్సాహంగా ఫీలవ్వచ్చు కాని అది సాంకేతిక లోపంతో వచ్చిందని బ్యాంక్‌ అధికారులు చెబితే ఆ ఉత్సాహం కాస్త నిరుగారిపోతోంది. ఉత్తర్ ప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన భాను ప్రకాష్ ఖాతాలో ఏకంగా రూ.9,900 కోట్లు జమయ్యాయి. ఆ మెసెజ్ చేసిన అతడు ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా సాఫ్ట్‌వేర్‌ లోపంగా గుర్తించారు.

భాను ప్రకాష్ కు తన బరోడా యూపీ బ్యాంక్ ఖాతాలో రూ. 99,99,94,95,999.99 జమయినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసినప్పుడు తన కళ్లను తానే నమ్మలేకపోయానని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. అసలైన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణ ఖాతా నుంచి అనుకోకుండా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారిన తర్వాత, బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌లోని బగ్ కారణంగా ఖాతాలో నగదు జమైనట్లు చూపించిందని అధికారులు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ రోహిత్ గౌతమ్ వెల్లడించారు. ఖాతాదారునికి పూర్తి విషయాలు తెలిపిన తర్వాత ఆ తప్పును సరిచేసేందుకు ఖాతాను కొన్ని రోజుల వరకు నిలిపేస్తున్నట్లు చెప్పారు.

కాగా.. గత ఏడాది చెన్నై లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇద్రిస్ కి అతని స్నేహితుడు రెండు వేల రూపాయలు పంపగా అతని ఖాతాలో రూ.753 కోట్లు (రూ. 753,48,35,179.48) వచ్చాయి. అప్పుడు కూడా సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు జరిగిందని అధికారులు తెలిపారు.