NTV Telugu Site icon

Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ.3.50 కోట్లు మంజూరు

Peddavagu

Peddavagu

Peddavagu Project: ఇటీవల వర్షాలతో వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్ద వాగుకు 250 మీటర్ల పొడవున గండిపడిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో ఇటీవల గండిపడి భారీ నష్టం జరిగింది. పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్‌లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. బండ్‌ ఫార్మేషన్, అప్రోచ్‌ కాలువ పనులకు రూ.3.5 కోట్లతో అధికారులు అంచనాలను తయారు చేయగా.. అశ్వారావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు తక్షణ సాయంగా రూ3.50కోట్ల రూపాయలను చేసిన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రాజెక్టు కట్ట మరమ్మతులకు కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ ఏడాది ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్‌లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

Read Also: CS Shanti Kumari: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

ఇటీవల పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు.. మొత్తం 20 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు మేకలు కొట్టుకు పోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు నేల కొరిగి వరదలో కలిసి పోయాయి. ఎన్నో ఆశలతో సాగుచేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.