Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో భారీ ఆర్థిక అవకతవకలు వెలుగుచూశాయి. అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) సిబ్బంది జీతాల విషయంలో దాదాపు రూ.1.50 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఆడిట్‌లో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు సబ్ ట్రెజరీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
అహోబిలం పీహెచ్సీకి చెందిన యుడిసి ఇంతియాజ్ అలీ ఖాన్ తన సమీప బంధువుల పేర్లతో పలు నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఖాతాలకు సంబంధించి ఫేక్ ఐడీలను సృష్టించి, జీతభత్యాల కోసం డీడీఓ సంతకాలతో బిల్లులను సబ్ ట్రెజరీకి పంపినట్లు అధికారులు గుర్తించారు. నలుగురు ఉద్యోగులకు ఒకే బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ, దాన్ని గమనించకుండా సబ్ ట్రెజరీ అధికారులు, డీడీఓలు సంతకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ ఖాతాల్లో జమ అయిన జీతాలను ఇంతియాజ్ అలీ ఖాన్ గత ఐదేళ్లుగా డ్రా చేసుకున్నట్లు సమాచారం. ఈ గోల్‌మాల్‌లో సబ్ ట్రెజరీతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అక్రమాలను నిర్ధారించారు.
Kishan Reddy: లోపల జరిగిందొకటి, బయట ప్రచారం చేసింది ఒకటి.. కేంద్రమంత్రి సీరియస్..!
ఈ కేసులో భాగంగా సబ్ ట్రెజరీ అధికారి సుశీల, సీనియర్ అసిస్టెంట్ వెంకటరావు, పద్మలతలపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే మరో ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.
