Rohit Sharma about T20 World Cup: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తమకు మద్దతుగా నిలిచారని.. అందుకే తన నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్లేయర్స్ అందరూ ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతిని తాను మాటల్లో చెప్పలేనని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు. గత జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. రెండోసారి పొట్టి టోర్నీని ఖాతాలో వేసుకుంది.
సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల కార్యక్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘జట్టులో మార్పు తేవడం నా కల. ఫలితాల గురించి ఆలోచించకుండా ప్లేయర్స్ స్వేచ్ఛగా ఆడే వాతావరణం కల్పించాలనుకున్నా. ఇందుకోసం రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్, జై షాల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఆ మద్దతు వల్లే నేను చేయాలనుకున్నది చేశా. ఇక్కడ ఆటగాళ్లను మరువొద్దు. జట్టు లక్ష్యాన్ని చేరుకోవడంలో సహకరించారు. ప్రతి ఒక్కరు తమ సహకారం అందించారు. కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలబడ్డారు’ అని అన్నాడు.
‘భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. అది ప్రతి రోజూ కలిగే అనుభూతి కాదు. ఫైనల్ విజయాన్ని మేమెంతో ఆస్వాదించాం. ప్రపంచకప్ విజయం మాకే కాదు మొత్తం దేశానికీ ముఖ్యమైంది. కప్పు గెలిచి ఇక్కడ జనంతో కలిసి సంబరాలు చేసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. భారత వన్డే, టెస్టు కెప్టెన్‌గా కూడా మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నా’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.