ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అతడి భార్య గీతా బాస్రా హోస్ట్ చేసిన ‘హూ ఈజ్ ది బాస్ వైటీ’ అనే టాక్ షోలో రోహిత్ సతీసమేతంగా పాల్గొన్నాడు. భారత వన్డే కెప్టెన్ రోహిత్ ఈ షోలో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) మ్యాచ్ సందర్భంగా తాను టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయా అని, చీఫ్ మెంటర్ అనిల్ కుంబ్లేకు ఏదో చెప్పి కవర్ చేశా అని తెలిపాడు. హిట్‌మ్యాన్ తరచుగా ఫోన్, పాస్‌పోర్ట్ మర్చిపోతుంటాడన్న విషయం తెలిసిందే.
‘అది 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్. నేను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నా, అనిల్ కుంబ్లే భాయ్ జట్టుకు చీఫ్ మెంటర్‌గా ఉన్నారు. టాస్ కోసం నేను మైదనంలోకి వెళ్లా. టాస్ గెలిచిన తర్వాత నేను బ్యాటింగ్ ఎంచుకున్నా. నిజానికి టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని మేం ముందే అనుకున్నాం. నేను అది మర్చిపోయా. అనిల్ భాయ్ వచ్చి.. రోహిత్ నువ్ ఏం చేశావ్? అని అడిగాడు. పిచ్ బాగుంది కాబట్టి బ్యాటింగ్ ఎంచుకున్నాను అని కవర్ చేశా. నేను మర్చిపోయి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ ఆ మ్యాచ్‌లో మేం గెలిచాం. మ్యాచ్ అయ్యాక బతికిపోయా అని అనుకున్నా’ అని రోహిత్ శర్మ చెప్పాడు. అప్పుడు హర్భజన్ సింగ్ సహా ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read: Jasprit Bumrah: అప్పటివరకు క్రికెట్ ఆడుతా.. బుమ్రా కీలక వ్యాఖ్యలు!
ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల రోహిత్ దక్షిణాఫ్రికాపై 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. హిట్‌మ్యాన్ ఇప్పుడు వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత రోహిత్ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 149.28 స్ట్రైక్ రేట్‌తో 418 పరుగులు చేశాడు. ఆగస్టు 17 నుండి 23 వరకు బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. ఆపై అక్టోబర్ 19న ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.
