NTV Telugu Site icon

Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!

Rohit Sharma Emotional

Rohit Sharma Emotional

Rohit Sharma React on World Cup 2023 Final Defeat: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి గురించి స్పందించాడు. ఫైనల్ ఓటమిని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని, ఓటమి బాధ‌ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారింద‌ని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. తన కుటుంబం మరియు స్నేహితులు చుట్టూ ఉన్న విషయాలను తేలికగా చేశారని చెప్పాడు. ఓటమి బాధ‌ నుంచి బయటపడటం కోసం సహకరించిన తన కుటుంబం మరియు అభిమానులకు రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు. నవంబర్ 19న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు వరుసగా పది విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. ఫైనల్లో ఓడటంతో రోహిత్ సహా అందరూ కంటతడి పెట్టారు.

ముంబై ఇండియన్స్‌ పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదు. నేను అస్సలు జీర్ణించుకోలేకపోయా. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. నా చుట్టూ ఉన్న విషయాలను చాలా తేలికగా చేశారు. ఇది జీర్ణించుకోవడం సులభం కాదు కానీ.. జీవితం ముందుకు సాగుతుంటుంది. కాబట్టి మనం ముందుకు సాగాలి. నిజాయితీగా చెప్పాలంటే ముందుకు సాగడం అంత సులభం కాదు. ఎందుకంటే.. నేను ఎప్పుడూ వన్డే ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. నాకు అదే గొప్ప బహుమతి. మేము ఇన్ని సంవత్సరాలు ప్రపంచకప్‌ కోసం కష్టపడ్డాం. చివరకు దాన్ని అందుకోలేకపోవడంతో నిరాశ చెందాం. కోరుకున్నది దక్కకపోతే ఎవరైనా నిరాశ చెందుతారు’ అని అన్నాడు.

‘మా వైపు (జట్టు) నుండి మేము చేయగలిగినదంతా చేసాము. మా వైపు నుండి ఏమి తప్పు జరిగిందని ఎవరైనా అడిగితే?.. మేము 10 గేమ్‌లు గెలిచాము. ఆ 10 గేమ్‌లలో మేము తప్పులు చేసాము. అయితే ఫర్ఫెక్ట్ గేమ్ అంటూ ఉండదు. ప్రతి గేమ్‌లో తప్పిదాలు జరుగుతాయి. జట్టు ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నాను. మేము చాలా అద్భుతంగా ఆడాం. ప్రతి ప్రపంచకప్‌లో ఇలా ఆడలేరు. మేము ఎలా ఆడామని నాకు తెలుసు. మా ప్రదర్శన ప్రజలకు చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని రోహిత్ శర్మ వీడియోలో చెప్పాడు.

Also Read: Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌.. వీడియో వైరల్‌!

‘ఫైనల్ తర్వాత నేను ముందుకు వెళ్లాలని అనుకున్నాను. అందుకే నేను ఎక్కడికైనా వెళ్లి నా మనస్సును కుదుటపరచాలనుకున్నా. నేను ఎక్కడ ఉన్నా.. అభిమానులు న వద్దకు వచ్చి ఎంతో బాగా ఆడారని అభినందించారు. వాళ్లను చూసి నాకు చాలా బాధగా అనిపించింది. మాతో పాటు ఫాన్స్ కూడా ప్రపంచకప్ గెలవాలని ఎన్నో కలలు కన్నారు. మాకు మద్దతుగా నిలిచారు. ప్రపంచకప్ సమయంలో మేము వెళ్లిన ప్రతి చోటా ఫ్యాన్స్ మాకు అండగా నిలిచారు. ఇందుకు వాళ్లను అభినందించాల్సిందే. కానీ ఫైనల్ గురించి ఆలోచించిన ప్రతిసారీ ఎంతో నిరాశ కలుగుతోంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.