NTV Telugu Site icon

INDvsAUS Test: తుది జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే!

Sd

Sd

ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. రిషభ్ పంత్‌, శ్రేయస్ అయ్యర్ గాయాలపాలవ్వడం, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఫైనల్‌ ఎలెవన్‌లో ఎవరికి చోటివ్వాలనే దానిపై మేనేజ్‌మెంట్ దీర్ఘాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టులో ఆడే తుదిజట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పంత్ లేకపోవడం పెద్ద లోటే అయినా ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్లు టీమ్‌లో ఉన్నారన్నాడు.

Also Read: Uttar Pradesh: మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..

“రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం మాకు తీరని లోటే. అయితే అతని రోల్‌ను భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. మ్యాచ్ రోజే తుది జట్టు ఎంపికైన నిర్ణయం తీసుకుంటాం. జట్టులో ఉన్న నలుగురు స్పిన్నర్లు కూడా క్వాలిటీ స్పిన్నర్లే. అశ్విన్, జడేజా చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అవకాశం వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై మాకు క్లారిటీ ఉంది. టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని, సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతుందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Also Read: WTC 2023: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు

పిచ్‌ గురించి ఆలోచించడం మానేయండి

నాగ్‌పూర్ పిచ్‌ గురించి ఆస్ట్రేలియా టీమ్ రాద్ధాంతం చేయడంపైనా రోహిత్ స్పందించాడు. పిచ్‌ గురించి ఆలోచించడం మానేసి క్రికెట్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. “పిచ్‌పై కాకుండా క్రికెట్‌పై ఫోకస్ పెట్టండి. ఇరు జట్లలోని 22 మంది క్వాలిటీ ప్లేయర్లున్నారు. స్పిన్ పిచ్‌లకు తగ్గట్లు ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. ప్రతీ ఒక్కరికి భిన్నమైన విధానం ఉంటుంది. కొందరు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్‌ను ఎదుర్కొంటారు. అయితే స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మాత్రం ఎదురు దాడికి దిగాల్సి ఉంటుంది. కెప్టెన్లు విభిన్నమైన ప్రణాళికలతో ఉంటారు. ఫీల్డ్‌, బౌలింగ్‌లో మార్పులు చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారికే విజయం దక్కుతుంది” అని తెలిపాడు.

Also Read: Vijay Setupathi: నన్ను అలా పిలవొద్దని చెప్పా.. విజయ్ సీరియస్ వార్నింగ్