Rohit Sharma: రోహిత్ శర్మ అనగానే టక్కున గుర్తు కొచ్చేవి.. టీమిండియా జర్సీ, చేతిలో బ్యాట్, మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్. ఇక నుంచి హిట్‌మ్యాన్ మరో అవతారంలో కనిపించనున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ హిట్‌మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతను ఇప్పుడు బుల్లితెరపై సందడికి సిద్ధమవుతున్నాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ (Family Full House) అనే షోతో టెలివిజన్ హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ షో సెప్టెంబర్ 19, 2026 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, ‘సోనీ లివ్’ (Sony LIV) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కానుంది. రోహిత్ బుల్లితెరపైకి అడుగుపెడుతుండటంతో క్రికెట్ కెరియర్ ముగింపు దశకు చేరుకుందనే చర్చ మొదలైనప్పటికీ, దీనిని క్రికెట్‌కు వీడ్కోలు సంకేతంగా భావించడం మాత్రం తొందరపాటే అవుతుంది.
ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే (ODI) క్రికెట్‌లో మాత్రం ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం రోహిత్ భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో కీలక భాగంగా ఉన్నాడు. ఈ టీవీ షోకి యాంకరింగ్ చేయడం అనేది రోహిత్ కెరియర్‌లో ఒక కొత్త కోణం మాత్రమే తప్ప, వన్డే క్రికెట్‌కు దూరమయ్యే ఆలోచన లేదని స్పష్టమవుతోంది. రోహిత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ పూర్తి ఫార్మాట్ ఇంకా బయటకు రానప్పటికీ, విడుదలైన ప్రమోషనల్ వీడియోలు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా, రోహిత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మైదానంలో వైరల్ అయిన ‘గార్డెన్’ వ్యాఖ్యను ఈ ప్రోమోలో సరదాగా రీక్రియేట్ చేశారు. దీన్ని బట్టి ఈ షోలో రోహిత్ క్రికెట్ విశేషాలతో పాటు, అతడిలోని ఫన్నీ, వినోదాత్మక కోణాన్ని కూడా ప్రేక్షకులు చూడబోతున్నారని అర్థమవుతోంది.
టీవీ డెబ్యూ వార్త బయటకు రావడంతో రోహిత్ క్రికెట్ భవిష్యత్తుపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే టీవీ షోలకు హోస్టింగ్ చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎలాంటి అభ్యంతరాలు లేదా నిషేధాలు విధించలేదు. యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లు టీవీ షోలు చేయకూడదని బీసీసీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. పైగా రోహిత్ శర్మ చూపు ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. ఇటీవల లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ అద్భుత శతకంతో చెలరేగాడు. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించి, వన్డే ఫార్మాట్‌లో తనకు ఇంకా ఎంత సత్తా ఉందో మరోసారి నిరూపించాడు. ఇక, బుల్లితెరపై ఈ కొత్త ఇన్నింగ్స్ రోహిత్ కెరియర్‌లో ఓ పెద్ద మార్పే అయినప్పటికీ, 2027 ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్న అతడికి ఇది క్రికెట్ నుంచి విడ్కోలు మాత్రం కానే కాదు.

