Bihar Politics: బీహార్ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీలో అంతర్గత విభేదాలు, ఇంటిపోరు బయటపడింది. శరణ్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి హరేలాల్ యాదవ్‌ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడంపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ నాయకత్వానికి ఆమె సవాల్ విసిరారు. పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే, నిజం మాట్లాడే నాయకులకు ఇప్పుడు ఆర్జేడీలో చోటులేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. హారేలాల్‌ను బహిష్కరించడం దురదృష్టకరమని అన్నారు.
పార్టీలో ఉంటూ ఆర్జేడీని బలహీనపరుస్తున్న వ్యక్తులే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆమె అన్నారు. శరణ్ జిల్లా పార్టీ వ్యవస్థను పూర్తిగా కొందరు కుట్రపూరితంగా ఆధీనంలోకి తీసుకున్నారని, వారు ప్రత్యర్థుల సూచన మేరకు పనిచేస్తున్నారని విమర్శించారుు. పార్టీ కోసం పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. సంజయ్ యాదవ్ లేదా ఆయన లాంటి నేతలను ప్రశ్నించినందుకు ఎవరిపైనా అయినా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా నాపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. తాను ఇప్పటికీ పార్టీలో ఉన్నానని, పార్టీని కొందరు నేతల చెర నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తన గళం విప్పుతూనే ఉంటానని రోహిణి అన్నారు. తాను లాలూ కుమార్తెను అని, అన్యాయానికి ఎప్పుడూ తలొగ్గనని, తనపై ఎలాంటి చర్య తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

