ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిన సంగతి తెలిసిందే. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. ఇదిలా వుండగా మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకునే మహిళలే ప్రయోజనం పొందుతారన్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: YSR Congress Party: వైసీపీకి షాక్.. పార్టీకి సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల రాజీనామా..
చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడంపై కేంద్రాన్ని సిద్ధిఖీ నిలదీశారు. వెనకబడిన వర్గాల మహిళలకు చట్టంలో తగిన కోటా ఇవ్వాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లాలుప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు ఒకప్పుడు మంత్రిగా కూడా పనిచేసిన సిద్ధిఖీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కడ దుమారం రేగింది. ఆయన మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
అయితే ఈ వాఖ్యల విషయంలో ఆర్జేడీ అధికార ప్రతినిధి అజాజ్ అహ్మద్ సిద్ధిఖి మాత్రం అబ్దుల్ బారీ సిద్ధిఖీని సమర్థించారు. వెనకబడిన వర్గాల మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే మహిళా రిజర్వేషన్ చట్టంతో న్యాయం ఎప్పటికీ జరగదని అన్నారు. సిద్ధిఖీ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును అప్పుడే అమలు చేయలేమని జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాకే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేయడం సాధ్యమని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.