సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధపడుతున్న తరుణంలో లాలూకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.
దాదాపుగా 30 ఏళ్ల నాటి ఆయుధాల కేసులో శుక్రవారం గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇది ఆగస్ట్ 23, 1995 మరియు మే 15, 1997 మధ్య ఫారం 16 కింద ఆయుధాల సేకరణకు సంబంధించిన కేసు ఇది. ఈ కాలంలో మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలు, కాట్రిడ్జ్‌లు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పటి నాటి కేసులో ఇప్పుడు లాలూకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఆర్జేడీకి పెద్ద షాకిచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంకోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇబ్బందికరంగా మారింది.
మొత్తం ఈ కేసులో 23 మంది చిక్కుకున్నారు. ఆరుగురిపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో ఇద్దరు మరణించారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. 1998, జూలైలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇక ఈ కేసులో లాలూ తండ్రి పేరు తప్పుగా నమోదు చేశారు. అప్పట్లో పెద్ద వివాదం నెలకొంది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమికి ఇది పెద్ద షాక్‌కు గానే పేర్కొనవచ్చు. ఇప్పటికే కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ, జేజేఎం పార్టీలు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇరాకటంలో పడ్డాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టై జైల్లో ఉన్నారు. ఇరువురికి ఇంకా బెయిల్ లభించలేదు. ఈడీని అడ్డంపెట్టుకుని కేంద్రం ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇలా ఒక్కొక్కరు జైలుకెళ్లడం ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బే.
ఇక గతంలోనే దాణా కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష పడింది. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా పడింది. లూలూ జైలు శిక్ష కూడా అనుభవించారు. తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్‌పై ఆర్జేడీ ఎలా పోరాటం చేస్తుందో చూడాలి.