France Riots: ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అల్లర్లు, నిరసనల మధ్యలోనే దోపిడీలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమవుతోంది.
Read Also: Tholiprema : రీ రిలీజ్ లో రికార్డు క్రియేట్ చేసిన తొలిప్రేమ..
ఫ్రాన్స్ రాజధాని పారిస్ శివారులో ఓ యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై మొదలైన నిరసనల నాలుగో రోజుకు చేరుకున్నాయి. నయాల్ అనే బాలుడిని పారిస్ శివారులోని నాంటెర్‌లో ట్రాఫిక్ ఆగిపోతున్న సమయంలో పోలీసులు కాల్చివేశారు. దీంతో చెలరేగిన హింస శనివారం కూడా నాంటెర్రేలో కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా అరెస్టయ్యారు. అనేక నగరాలు కర్ఫ్యూలు విధించాయి. మరోవైపు దేశం అంతటా హింస వ్యాపించడంతో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జర్మనీలో ఒక ముఖ్యమైన పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడి జర్మనీ పర్యటన వాయిదా పడడం 23 ఏళ్లలో ఇదే తొలిసారి.
Read Also: Maharashtra Bus Fire: ఈ 8 మంది మృత్యుంజయులు.. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారంటే..?
దేశవ్యాప్తంగా ఈ రాత్రి 45,000 మంది పోలీసులను మోహరించింది. అల్లర్ల నియంత్రణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా పోలీసులు ప్రజా రవాణాను నిలిపివేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అల్లర్లలో పాల్గొంటున్న పిల్లల్ని నియంత్రించాలని వారి తల్లితండ్రుల్ని కోరారు. అల్లర్లలో ఎక్కువగా పాల్గొంటోంది వీరే. మరోవైపు ఫ్రాన్స్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాప్పే హింసను ముగించాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. రేపటిలోగా పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఎమర్జెన్సీ విధించేందుకు మాక్రాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
