NTV Telugu Site icon

GT vs KKR: చివరలో దుమ్మురేపిన రింకూ సింగ్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే గెలుపు

Rinku Singh

Rinku Singh

GT vs KKR: ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించ‌డంతో కోల్‌క‌తా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో కోల్‌క‌తా విజ‌యానికి 29 ర‌న్స్ కావాలి. య‌శ్ ద‌యాల్ వేసిన 20వ ఓవ‌ర్ రెండో బంతికి రింకూ సింగ్ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. వ‌రుస‌గా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, కోల్‌క‌తా ఆట‌గాళ్లు ప‌రుగెత్తుకుంటూ మైదానంలోకి వ‌చ్చారు. వ‌రుస రెండు విజ‌యాలతో ఊపు మీదున్న గుజ‌రాత్‌కు ఇది తొలి ఓట‌మి కావడం గమనార్హం.


యష్‌ దయాల్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఉమేశ్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి రింకూ సింగ్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. ఇక్కడి నుంచే రింకూ సింగ్‌ విధ్వంసం మొదలైంది. చివరి ఐదు బంతులను ఐదు సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రింకూ సింగ్‌ 21 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ 40 బంతుల్లో 80 పరుగులు చేసి కేకేఆర్‌ విజయానికి బాటలు వేశాడు. అయితే ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసి మ్యాచ్‌ను గుజరాత్‌ వైపు టర్న్‌ చేశాడు. అయితే యశ్‌ దయాల్‌ ఆఖరి ఓవర్లో చెత్తగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ ఓటమికి కారణమయ్యాడు.

ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు 
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. గుజరాత్‌ టైటాన్స్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. కాగా ఐపీఎల్‌లో రషీద్‌ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం విశేషం. గుజరాత్‌ టైటాన్స్‌ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం మరో విశేషం. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్‌ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ను పెవిలియన్‌ పంపి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రషీద్‌ ఖాన్‌కు టి20 కెరీర్‌లో ఇది నాలుగో హ్యాట్రిక్‌ కావడం విశేషం. ఇక ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన 19వ బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌గా అమిత్‌ మిశ్రా నిలిచాడు. అమిత్‌ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్‌ ఫీట్‌ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

Show comments