NTV Telugu Site icon

Bombay High Court: నిద్ర హక్కు మానవ ప్రాథమిక అవసరం.. దానిని ఉల్లంఘించకూడదు: బాంబే హైకోర్టు

Bombay High Court

Bombay High Court

నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం అని, దానిని (నిద్రించే హక్కు) ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే, దేరే, మంజుషా దేశ్‌ పాండేలతో కూడిన ధర్మాసనం ఈడీపై మండిపడింది.

మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్‌ కొతుమల్ ఇస్రానీ (64)ని ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై సవాలు చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు. తాను విచారణకు పూర్తిగా సహకరించానని.. పిలిచినప్పుడల్లా హాజరైనా కూడా అరెస్టు చేశారని, అది చట్ట విరుద్ధమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2023 ఆగస్టు 7న ఈడీఅధికారులు తనను రాత్రంతా విచారించి.. మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిని పరిశీలించిన బాంబే హైకోర్టు.. రామ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం కోర్టు తప్పుపట్టింది.

Also Read: RCB vs SRH: నేనూ బ్యాటర్‌ అయితే బాగుండు.. ప్యాట్‌ కమిన్స్‌ సరదా వ్యాఖ్యలు!

అయితే నిందితుడి అంగీకారంతోనే తెల్లవారుజాము 3 గంటల వరకు విచారించినట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించడంపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేయడాన్ని ఖండిస్తున్నాము. నిద్ర మనుషుల కనీస అవసరం. దానిని అందించలేకపోవడం హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది. అది ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపుతుంది. పగటిపూట మాత్రమే వాంగ్మూలం రికార్డు చేయాలి. తర్వాత రోజో లేదా మరోసారి అయినా సరే ఆ వ్యక్తిని విచారణకు పిలిచి ఉండాల్సింది’ అని బాంబే హైకోర్టు పేర్కొంది.

Show comments