Site icon NTV Telugu

Rickshaw drivers Protest: మరో సారి సమ్మెకు సై అంటున్న ఆటో వాలాలు

Pune

Pune

Rickshaw drivers Protest: బైక్ ట్యాక్సీ సేవలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆటో వాలాలు మరో మారు సమ్మెకు సై అంటున్నారు. వాటి కారణంగా తమ ఆదాయానికి తీవ్ర గండి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్ టాక్సీలు సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది ఆటో రిక్షా వాలాల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసింది. దీంతో వాటిని నియంత్రించాలని కోరుతున్నారు. నిజానికి బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని పుణే నగరంలోని వివిధ రిక్షా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రిక్షా కార్మికులు నవంబర్ 28న కూడా నిరవధిక ఆందోళనకు దిగారు.

Read Also: PM Modi: గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోదీ

అయితే కమిటీని నియమించి తగిన చర్యలు తీసుకుంటామని సంరక్షక మంత్రి చంద్రకాంత్ పాటిల్ చెప్పడంతో రిక్షా కార్మికులు సమ్మె విరమించారు. ఆ తర్వాత బైక్ ట్యాక్సీ విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. బైక్ ట్యాక్సీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోమారు నిరవధిక ‘చక్కా జామ్’ నిరసన చేపట్టాలని రిక్షా డ్రైవర్లు నిర్ణయించారు. బైక్‌ ట్యాక్సీలు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా రిక్షా కార్మికుల డిమాండ్‌లపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. తాము కూడా ఈ దేశ పౌరులమేనని.. న్యాయం పొందే హక్కు తమకు ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సోమవారం (డిసెంబర్ 12) ఉదయం 11 గంటల నుంచి ఆర్టీఓ కార్యాలయ ప్రాంతానికి వచ్చి ఆందోళన ప్రారంభిస్తామన్నారు.

Exit mobile version