NTV Telugu Site icon

Rice Research: కొత్తరకం సాంబమసూరి వరి వంగడం .. సాధారణం కన్నా అధిక దిగుబడి

Rice Research

Rice Research

Rice Research: సన్న బియ్యం ఇచ్చే వరి వంగడాల్లో తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న రకం సాంబమసూరి. వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడటంతోపాటు, ఎగుమతుల్లో సైతం మొదటి స్ధానం ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. వరి అన్నం దొరకటమే గగనమైన రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ సాంబమసూరి రకం వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. సాంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడులు ఇవ్వటం ఈ రకం వరి వంగడం స్పెషాలిటీ. ఇదిలా ఉండగా.. తాజాగా సాధారణ సాంబమసూరి కన్నా సుమారు 20 శాతం అధిక దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాన్ని రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆర్‌ఆర్‌) సృష్టించింది. జీన్‌ ఎడిటింగ్(జన్యు కూర్పు) పరిజ్ఞానంతో ఈ సన్నరకం వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు విరివిగా సాగు చేస్తున్న సన్నకం సాంబమసూరి వంగడాల్లోని జన్యువులను కూర్పు ఈ కొత్త విత్తనాన్ని సృష్టించారు.

లాబొరేటరీలో దీనితో సాగు చేసిన పైరులో సాధారణం కన్నా 35 శాతం అధిక దిగుబడి వచ్చింది. రైతుల పొలాల్లో మేలైన యాజమాన్య పద్ధతుల్లో పండిస్తే 20-30 శాతం అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా వేశారు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్న సాధారణ సాంబమసూరి(బీపీటీ 5204) వంగడాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు 1986లో వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ వంగడం దేశమంతా విస్తరించింది. దీని ధాన్యం నుంచి వచ్చే సన్నరకం బియ్యాన్ని వ్యాపారులు సోనామసూరి అని వివిధ ప్రాంతాల పేర్లను ముందు తగిలించి విక్రయిస్తున్నారు. కర్నూలు సోనా ఈ రకానికి చెందిన బియ్యమే. ఇంత ఆదరణ పొందిన ఈ వంగడంలోని మంచి లక్షణాలు మారకుండా అధిక దిగుబడి పొందేలా జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానంతో కొత్త వంగడాన్ని సృష్టించారు. సాధారణ వంగడంలో పండించిన పైరులోని వరి కంకిలో 200 వరకూ గింజలు ఉండగా.. జీన్‌ ఎడిటింగ్ వంగడంలో 350 నుంచి 400 గింజలు వచ్చాయి.

Yoga Mat: యోగాలో మ్యాట్‌ ఎంతో కీలకం.. మరి ఎలాంటి మ్యాట్‌ కొనాలి..?

ఈ జీన్‌ ఎడిటింగ్‌తో వరిమొక్కలో మరో కొత్త మార్పు వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జన్యు కూర్పు చేశాక కొత్త వంగడంతో పెరిగిన వరిమొక్క కాండం సాధారణ వంగడాని కన్నా మరింత బలంగా పెరిగిందన్నారు. ది. అంటే జన్యుకూర్పుతో భారీగా వచ్చే ధాన్యపుగింజల కంకి విరిగి పడిపోకుండా మొక్క కాండం దానంతట అదే బలపడటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అంటే కొత్త మార్పులకు అనుగుణంగా ప్రకృతిలో మొక్కల్లోని జీవజాలంలోనూ మార్పు వస్తుందనడానికి ధాన్యపు గింజల సంఖ్య పెరగగానే కాండం బలపడటం ఒక ఉదాహరణ అని మాకు అర్థమైందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.