CM Revanth Reddy: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
READ MORE: Chabahar Port: చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు అతిపెద్ద దౌత్య విజయం..
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. అన్ని చోట్ల వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్లుగా పౌరసరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించిందని అన్నారు. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లుల, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
READ MORE: Smartphones Launch In November: నవంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్ ఇవే..!
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్ఛార్జీ అధికారిని నియమించాలని, ఇప్పుడున్న ఇన్ఛార్జీలు నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే వేరే వాళ్లను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్ నుంచి ఏరోజుకారోజు సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవిన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టపు అంచనాలు తయారు చేయాలని నివేదించారు. తుఫాను, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రోడ్లు, రహదారుల పునరుద్ధరణ చర్యలు ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సమీక్షించాలని సీఎం కోరారు. తమ సొంత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ఇన్ఛార్జీగా ఉన్న జిల్లాల్లో ప్రజలను ఆదుకునే చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు.
READ MORE: Children Hostage Mumbai: ముంబైలో సంచలన ఘటన.. బందీలుగా ఉన్న 20 పిల్లల రెస్క్యూ
ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలతో పాటు ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే విద్యుత్తు పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు. అన్ని రోడ్లు, రహదారులపై ఉన్న బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని సీఎం అన్నారు. రోడ్లు, రహదారులపైకి వరద నీళ్లు వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేయాలన్నారు. స్థానిక సీఐ, రెవిన్యూ అధికారులు వాహనాలు అటువైపు వెళ్లకుండా రెండు వైపులా బారికేడ్లు పెట్టాలన్నారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని, కుంభ వృష్టి కురిసే సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
READ MORE: Warangal: వర్షాలతో ఇబ్బందులు., అల్పాహారం ఇవ్వలేదని స్థానికుల ఆవేదనపై, కలెక్టర్ స్నేహా శబరిష్ స్పందన
వరంగల్ లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా టీమ్లను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వరంగల్లో తక్షణ సహాయక చర్యలకు అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరంగల్లో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు, ఫుడ్ పాకెట్లు సరఫరా చేయాలని సూచించారు. వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
కాగా.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రేపు ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటించారు.
