CM Delhi Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రూ. 30 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి విజ్ఞప్తిరాష్ట్ర ప్రస్తుత ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 30 వేల కోట్ల తక్షణ ఆర్థిక ప్యాకేజీని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరనున్నారు.
అలాగే రాష్ట్రంలో నెలకొన్న ఎల్-నినో పరిస్థితులు, కరువు ప్రభావం, సాగునీటి అవసరాలు మరియు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీతో విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఢిల్లీలో ఇతర ముఖ్య కార్యక్రమాలు, భేటీలుప్రధానితో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ పుస్తక విడుదల కార్యక్రమంలో ఆయన పాలుపంచుకోనున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ హాజరవుతారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై తాజా రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

