నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే.. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించి కృష్ణ నదిపై ప్రాజెక్టులు కట్టాలని ప్లాన్ చేశారన్నారు. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ లాంటి వాళ్లు సొంత పార్టీపైనే ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కూడా పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కోట్లడారన్నారు. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్, హరీష్ రావు సంతకం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వతంగా గొంతుకోశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీటి వాటాలపై తెలంగాణ అసెంబ్లీలో రేపు చర్చ జరగనున్న దృష్ట్యా ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ లబ్దికోసం మేము పక్క రాష్ట్రాన్ని తిట్టడం లేదు. జరిగిన అన్యాయంను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అని లెక్కలు తీశారు. తెలంగాణకు 34 శాతం చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్, హరీష్ రావు సంతకం చేశారు. కేసీఆర్ సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వతంగా గొంతుకోశారు. ఓపిక లేని మనిషి చేసిన తప్పు అది’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
‘811 టీఎంసీలలో మాకు 512 టీఎంసీలు ఇవ్వాలని మేం కోట్లాడుతున్నాము. మా వాదనతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. తెలంగాణ తన వాటా దక్కించుకునే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. బీఆర్ఎస్ నీళ్ల పంచాయతీ వెనక కుంచిత రాజకీయం ఉంది. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ మనుగడ కష్టం అవుతుంది అని కేసీఆర్ మరలా నీళ్ల పంచాయతీ అని పెట్టాడు. అబద్దాల సంఘం పెట్టుకుని.. కేసీఆర్, హరీశ్ మాట్లాడి మాపై అపోహలు కలిగించేలా చేస్తున్నారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలం మార్చారు. 32 వేల కోట్లతో పూర్తి అవ్వాల్సింది.. 84 వేల కోట్లు పెట్టినా పూర్తవుతుందని నమ్మకం కూడా లేదు. జూరాల నుంచి లిఫ్ట్ చేసుకుని మహబూబ్ నగర్, రంగారెడ్డి ఎక్కడికైనా నీళ్లు తీసుకోపోవచ్చు. కానీ తల వదిలేసి.. తోక శ్రీశైలం దగ్గరికి వెళ్ళాడు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 0.25 టీఎంసీలు వాడుకుంటున్నాం’ అని సీఎం అన్నారు.
Also Read: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!
‘ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయిన ప్రాజెక్టుల్లో అభ్యంతరం చెప్పొద్దు అని చెప్పింది. ట్రిబ్యునల్ ముందు ఏపీ అసలు వాదనకే రావడం లేదు. మీరు ఒప్పుకున్నారు కాబట్టి అది చర్చకే రాకుండా చేస్తుంది ఏపీ. కృష్ణా బేసిన్లో నీళ్లు పెన్నాకి తీసుకెళ్లడం మేము అంగీకరించము. ఉమా భారతి ముందు వాదన చేయాల్సింది.. చేయలేదు కేసీఆర్. ఏడేళ్లు అయినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి DPR సిద్ధం చేయలేదు. పాలమూరు రంగారెడ్డి సాగు కోసం కాదు.. తాగు నీటి కోసం కడుతున్నాం అని చెప్పింది కేసీఆర్. రేపు సభలో అన్ని డాక్యుమెంట్లు పెడతాం. మనం చేసింది చెప్పుకోలేక పోతున్నాం. వాళ్ళు 25 ఏండ్ల నుంచి అబద్ధాలు చెప్తున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
