Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దేశంలో కాంగ్రెస్‌దే అధికారం..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని.. ఏ శాఖలు తీసుకోవాలని చర్చ చేస్తున్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి 4-5 సీట్లు వస్తాయని జేపీ నడ్డా అన్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకే రాని వాడు అసెంబ్లీకి వస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో భిన్నాభిప్రాయాలు ఉన్నా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాని ప్రతిపక్ష నేత ఒక నేతనా అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ చెప్పినట్టు సెక్రటేరియట్ బయట కాదు.. సెక్రటేరియట్ లోపలనే ఏర్పాటు చేస్తామన్నారు. సెక్రటేరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు అంటూ ప్రశ్నించారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించేందుకు బాధ్యతలు అప్పగించామన్నారు.

Read Also: Telangana Exit Poll Results 2024: తెలంగాణలో గెలుపెవరిది?.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..

కాకతీయ కళాతోరణం తొలగింపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాకతీయ రాజులను సమ్మక్క సారలమ్మలను చంపిన రాజుగానే చూస్తామన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే ఆవిర్భావ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ సందేశం ఉంటుందన్నారు. అఖిలపక్ష సమావేశానికి మేము పిలువక ముందే కేటీఆర్ రోడ్డు ఎక్కాడన్నారు. రోడ్డెక్కిన వాళ్లను పిలిచి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. రోడ్డెక్కి మాట్లాడినదే వారి విధానం కదా అఖిలపక్షానికి వచ్చి కొత్తగా చెప్పేదేముందన్నారు. ప్రభుత్వ లోగోలో అమరవీరుల స్థూపం ఉండొద్దా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలపైన కేసీఆర్ కుటుంబానికి అక్కసు అంటూ వ్యాఖ్యానించారు. కనీసం లోగోలో అమరవీరుల స్థూపం పెట్టిన సహించలేక పోతుందని ఎద్దేవా చేశారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం.. కొత్త ప్రభుత్వ లోగోను ఒకేసారి ఆవిష్కరిస్తామన్నారు.

Read Also: AP Assembly & Lok Sabha Exit Poll 2024: ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌.. అధికారం ఎవరిదంటే..?

పవర్ కట్లపై సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ సబ్ స్టేషన్ కి అయినా వెళ్లి తనిఖీ చేద్దామని.. లాక్ బుక్కుల్లో విద్యుత్ సరఫరా చెక్ చేద్దామని ఛాలెంజ్‌ చేశారు. భూపాలపల్లిలో టీఆర్ఎస్ అనుబంధ నాయకులతో కరెంటు కోతలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామన్నారు. కేసీఆర్ పాకిస్తాన్ లాగా వ్యవహరిస్తున్నారని.. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒకరోజు ముందు పాకిస్తాన్ ఉత్సవాలు చేస్తుందని అన్నారు. అలాగే కేసీఆర్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒకరోజు ముందే వేడుకలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌కు, కేసీఆర్‌కు పెద్దగా తేడా లేదన్నారు. ఈనెల 27 తో పీసీసీ పదవి కాలం ముగుస్తుందని.. పీసీసీగా సీనియర్‌ నేతకు పార్టీ అవకాశం ఇస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కూలిందని.. మూడేళ్లు అధికారంలో ఉన్న ఎందుకు రిపేర్లు చేయలేదని ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్‌ పై ఎన్నికల కోడ్ ముగియగానే సమీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారని.. అప్పుడు సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నిచారు. కేసీఆర్‌ను బీజేపీ సెట్టింగ్ చేసుకోవడానికి సీబీఐ విచారణ కోరుతోందని ఆరోపించారు. నయీమ్ ఆస్తులపై ఫిర్యాదు రాలేదని.. ఫిర్యాదు వస్తే విచారణ అధికారికి సిఫార్సు చేస్తామన్నారు.

Exit mobile version