NTV Telugu Site icon

Justice Narasimha Reddy: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగా..

Justice Narasimha Reddy

Justice Narasimha Reddy

Justice Narasimha Reddy: తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ ఛైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. అనంతరం సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంపై ప్రాథమిక వాదోపవాదాలు మాత్రమే విన్నదని ఆయన వెల్లడించారు. అలాగే ఒక జస్టిస్ హోదాలో తనకు ఎలాంటి పక్షపాతం లేదని.. అలా పక్షపాతంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు.

Read Also: Srisailam Project: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన తెలంగాణ జెన్ కో

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాను కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగినట్లు జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ తనకు రాసిన లేఖలో కూడా సమాజం అంగీకరించే భాష వాడలేదని అన్నారు. విచారణ కమిషన్లు వేసేదే.. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను గతంలో వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌పై వేసిన కమిషన్‌కు కూడా పనిచేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌గా.. నన్నే తప్పుకోమని కేసీఆర్‌ లేఖ రాశారని వెల్లడించారు. తాను సీఎం రేవంత్‌ రెడ్డితో ఫోన్‌లో కూడా మాట్లాడలేదని.. బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టానంటూ ఆయన పేర్కొన్నారు. ప్రతీ కమిషన్‌ ఛైర్మన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడం సాధారణమేనని వెల్లడించారు. తాను 28 మందికి లేఖలు రాశానని.. కేసీఆర్‌ తప్ప మిగతావారంతా తమ అభిప్రాయాలు చెప్పారని తెలిపారు. తాను ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని, లేఖలు మాత్రమే రాశానన్నారు. తప్పు చేశారని కూడా లేఖలో పేర్కొనలేదన్నారు. కొన్ని ఊహాగానాలతో వార్తలు రావడం వల్ల స్పష్టత ఇవ్వాలని ప్రెస్‌మీట్‌ పెట్టినట్లు చెప్పారు. తాను ప్రెస్‌మీట్‌లో ఎక్కడా తన అభిప్రాయాన్ని కూడా చెప్పలేదన్నారు.ఎన్నో కమిషన్ల ఛైర్మన్లు ప్రెస్‌మీట్ పెట్టినా రాని అభ్యంతరం.. తనపై మాత్రం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. “అందరి అభిప్రాయాలను తీసుకొని నివేదిక తయారు చేశాను.. నా రిపోర్ట్‌ అనేది నా వ్యక్తిగతం, దానిపై ఎవరికీ హక్కు లేదు.. కమిషన్ ఇచ్చే రిపోర్ట్‌ను ప్రభుత్వం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు.. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ తప్పు అని ఎవరైనా సవాల్ చేయవచ్చు.” అని జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి పేర్కొన్నారు.

 

Show comments