NTV Telugu Site icon

Rest Day in Test: ఇదేందయ్యో ఇది.. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి రోజు!

Sl Vs Nz Rest Day

Sl Vs Nz Rest Day

Rest Day in SL vs NZ Test Match: క్రికెట్‌లో మనం డ్రింక్స్ బ్రేక్, లంచ్ బ్రేక్, టీ బ్రేక్‌లను చూస్తుంటాం. అలానే రిజర్వ్‌ డే గురించి కూడా అందరికీ తెలుసు. అయితే విశ్రాంతి రోజు (రెస్ట్ డే) గురించి మాత్రం ఎవరికీ తెలీదు. మూడు దశాబ్దాల క్రితం ఉండే ఈ విశ్రాంతి రోజు.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. గత 30 ఏళ్లలో రెస్ట్ డే తీసుకున్న దాఖలు లేవు. అయితే ప్రస్తుతం గాలే వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.

గాలే అంతర్జాతీయ స్టేడియంలో సెప్టెంబర్ 18న శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం అయింది. 18, 19, 20 తేదీల్లో మూడు రోజుల ఆట ముగిసింది. శనివారం (సెప్టెంబర్ 21) నాలుగో రోజు ఆట జరగాలి. కానీ నాలుగో రోజును విశ్రాంతి రోజుగా ప్రకటించడంతో.. శనివారం మ్యాచ్ జరగలేదు. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడమే ఇందుకు కారణం. ఇక ఆది, సోమవారాల్లో మ్యాచ్ కంటిన్యూ కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్వదేశంలోనే ఉన్న శ్రీలంక క్రికెటర్లు సహా సహాయ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు లంక క్రికెట్‌ బోర్డు విశ్రాంతి రోజును షెడ్యూలులో చేర్చింది.

Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’!

విశ్రాంతి రోజున శ్రీలంక క్రికెటర్లంతా వారి సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆటగాళ్లకు రవాణా ఏర్పాటు కూడా లంక క్రికెట్‌ బోర్డు అరేంజ్ చేసింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫాన్స్ ‘టెస్టుల్లో విశ్రాంతి రోజా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేందయ్యో ఇది.. ఇది నేనెప్పుడూ చూడలే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ టెస్టును రిషెడ్యూల్ చేయొచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడో షెడ్యూల్ అయింది. అంతేకాదు ఇరు జట్లు ఇతర సిరీస్‌లో ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో టెస్టును రీషెడ్యూల్‌ చేయడం అసాధ్యం. అందుకే మధ్యలో విశ్రాంతి రోజు ఇచ్చారు.