Site icon NTV Telugu

Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం.. ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు

Earthquake Prediction

Earthquake Prediction

Turkey Earthquake: టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కుప్పకూలాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇంతటి విపత్తును ముందే అంచనా వేయలేదా అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. అయితే, ఇంతటి భూకంపం సంభవిస్తుందని ఓ పరిశోధకుడు మూడు రోజుల ముందే హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ హెచ్చరికను తేలికగా తీసుకోవడం వల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉందనే వాదన ప్రస్తుతం మొదలైంది.

భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్‌ సిస్టమ్‌ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌.. తాజా విపత్తును ముందే అంచనా వేశారు. ‘త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జొర్డాన్‌, సిరియా, లెబనాన్‌ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంపం ఇంతటి విధ్వంసాన్ని సృష్టించింది. దీనిపై స్పందించిన ఫ్రాంక్‌ హూగర్‌బీట్స్‌ ఈ విషాదం తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భూకంపం వస్తున్నట్లు ముందుగానే చెప్పానని.. అది 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అన్నారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామన్నారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.

 

అయితే మొదట ఫ్రాంక్ హూగర్‌బీట్స్ హెచ్చరించిన సమయంలో ఆయన ట్వీట్లను ఎవరూ నమ్మలేదు. ముందస్తుగా చేసిన హెచ్చరికలపై విమర్శలు కూడా వచ్చాయి. భూకంపాలను ఎవరూ అంచనా వేయలేరని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే భారీ భూకంపం సంభవించడంతో ఫ్రాంక్ హూగర్‌బీట్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆయన ట్వీట్‌ను చాలా మంది రీట్వీట్లు చేస్తున్నారు. ఆయన హెచ్చరించిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version