NTV Telugu Site icon

Chhattisgarh: బోరు బావిలో బాలుడు.. 60 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్

52055055

52055055

చత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు బోర్ బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పిహ్రిద్ గ్రామంలో   ఇంటి వెనకాలు ఉన్న పెరట్లో ఆడుకుంటున్నరాహుల్ సాహు అనే బాలుడు నిరుపయోగంగా ఉన్న బావిలో జూన్ 10న పడిపోయాడు. అప్పటి నుంచి బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు సాగుతున్నాయి. దాదాపుగా 62 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని రెస్య్కూ సిబ్బంది చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కెమెరాల ద్వారా బాలుడి పరిస్థితిని గమనిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ భాఘేట్ రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

బాలుడికి రక్షించేందుకు వైద్య సిబ్బంది ఆక్సిజన్ ను అందిస్తోంది. రక్షణ చర్యల్లో కోల్ ఇండియాకు చెందిన రెస్క్యూటీం కూడా పాలు పంచుకుంటోంది. బాలుడు పడిన బోర్ కు సమాంతరంగా మరో గొయ్యిని తీసి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాలుడు పడిన ప్రాంతం అంతా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందిగా మారుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. డ్రిల్లింగ్ పనులకు పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డంకిగా మారాయి. బాలుడిని బయలకు తీసేందుకు మరో 10 నుంచి 12 గంటల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే రెస్క్యూ సిబ్బందికి బాలుడు స్పందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. దాదాపుగా 500 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇది గడిచిన వారంలో రెండో సంఘటన. గుజరాత్ లో గత వారం ఏడాదిన్నర బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అయితే ఆర్మీ సిబ్బంది రెస్క్యూ చేసి బాబును కాపాడింది. బాలుడు కేవలం 30 అడుగుల లోపలే చిక్కుకుపోవడంతో బాలుడిని సురక్షితంగా రక్షించారు. తాడుకు ఒక హ్యంగర్ తగిలించి బోరు బావిలోకి వదిలారు. అది బాలుడి షర్ట్ కు చిక్కుకున్న తరువాత నెమ్మదిగా పైకి లాగారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాజాగా చత్తీస్ గఢ్ లో మరో బాలుడు బోరుబావిలో పడ్డాడు.