గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కొన్నిచోట్ల కుక్కలను చంపేస్తున్న ఘటనలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం సహా మున్సిపల్ యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై సినీ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మూగజీవులను దారుణంగా హతమార్చడం అమానుషమని ఆమె ధ్వజమెత్తారు. “ప్రతి వంద కుక్కలలో కేవలం ఐదు మాత్రమే దూకుడు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు, ఆ ఐదు కుక్కల కారణంగా మిగిలిన 95 శాతం సాధు స్వభావం కలిగిన కుక్కలను చంపడం ఎంతవరకు న్యాయం?” అని ఆమె ప్రశ్నించారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, మనుషుల స్వార్థం కోసం వాటిని తుదముట్టించడం క్రూరత్వమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read :Anirudh : అనిరుధ్ ఆలస్యం వెనుక అసలు రహస్యం ఇదే.. నిర్మాత క్రేజీ కామెంట్స్!
వీధి కుక్కల సంఖ్య పెరగడానికి అలాగే అవి అగ్రెసివ్‌గా మారడానికి ప్రధాన కారణం ప్రభుత్వాల అసమర్థతే అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు, నగరాల్లో చెత్తాచెదారం సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల కుక్కలకు ఆహారం దొరికి సంతానోత్పత్తి విపరీతంగా పెరుగుతోంది అని ఆమె అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు (ABC), వ్యాక్సినేషన్ సక్రమంగా వేస్తే ఈ సమస్యే ఉత్పన్నం కాదు, ఆ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలు, ఇప్పుడు కుక్కలను చంపడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామనుకోవడం మూర్ఖత్వమని ఆమె విమర్శించారు.
Also Read :The Paradise: పెద్ది, ప్యారడైజ్ కలిసి రావు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?
సమాజంలో జరుగుతున్న ఇతర ప్రాణనష్టాలను ప్రస్తావిస్తూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “రోడ్డు ప్రమాదాలు, దోమ కాటుతో చనిపోయే వారు, మద్యానికి బానిసై ప్రాణాలు తీసేవారు, మహిళలపై అఘాయిత్యాలు చేసేవారు, ఇలా మనుషుల వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు లక్షల్లో ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి, కేవలం కుక్కల వల్ల జరిగిన మరణాలను మాత్రమే భూతద్దంలో చూపిస్తూ మూగజీవులను వేటాడటం ఏ రకమైన న్యాయం?” అని నిలదీశారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కుక్కల సంహారానికి పూనుకోవడం అన్యాయమని ఆమె అన్నారు, కాలభైరవుడిగా పూజలందుకునే కుక్కలను హింసించడం సంస్కారం కాదని గుర్తు చేశారు. తనకు 45 ఏళ్ల వయసు వచ్చేవరకు ఏ వీధి కుక్క కూడా తనపై దాడి చేయలేదని, మనిషి ప్రేమగా ఉంటే అవి కూడా అంతే ప్రేమను చూపిస్తాయని తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా తప్పుడు విధానాలను మానుకుని, మూగజీవుల హత్యలను తక్షణమే నిలిపివేయాలని, శాస్త్రీయ పద్ధతుల్లో సమస్యను పరిష్కరించాలని రేణు దేశాయ్ డిమాండ్ చేశారు.
