Site icon NTV Telugu

Pakistan: సైఫర్ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట.. నిర్దోషిగా ప్రకటన

Pak

Pak

సైఫర్ కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ను ఇస్లామాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు స్నేహితుడు, మాజీ విదేశాంగ శాఖ మంత్రి మహమూద్ ఖురేషీని కూడా నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఇద్దరికి న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. ఇమ్రాన్‌ఖాన్ దగ్గర దౌత్య పరమైన రహస్యాలు ఏమీ తన దగ్గర ఉంచుకోలేదని.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర కూడా ఏమి లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇదే కేసులో గత జనవరిలో ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు.. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఇదే కేసులో పదేళ్ల శిక్ష పడింది. స్పెషల్‌ కోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్.. హైకోర్టుకు వెళ్లారు. దీంతో సోమవారం భారీ ఊరట లభించింది.

ఇది కూడా చదవండి: Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం

సైఫర్ కేసు (ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం) అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. 2023 మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్.. ప్రధాని పదవి నుండి వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2023 ఆగస్టు 5న ఇమ్రాన్ జైలుకు వెళ్లారు.

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షను ఇటీవల ఇస్లామాబాద్‌ హైకోర్టు నిలిపివేసింది. ఆ వెంటనే సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ అరెస్టయ్యారు. సైఫర్‌ కేసులో పాక్‌ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. 2023 సెప్టెంబర్‌లో ఇమ్రాన్‌, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. అనంతరం వారికి 10 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మొత్తానికి ఐదు నెలల విరామం తర్వాత ధర్మాసనం నిర్దోషులుగా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Pictures Morphed: విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్.. నలుగురు అరెస్ట్

Exit mobile version