దేశంలోని ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్ వెలవెల బోతున్నాయి. స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఘోస్ట్ షాపింగ్ మాల్ అంటే.. ఒక మాల్‌లో 40 శాతానికి మించి స్థలం ఖాళీగా ఉంటే దానిని ఘోస్ట్ షాపింగ్ మాల్ అంటారు. ఇలాంటివి 2022లో 57 షాపింగ్ మాల్స్ ఉండగా, 2023లో వీటి సంఖ్య 64కు పెరిగిందని ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2024’ నివేదికలో తెలిపింది. ఈ 64 షాపింగ్ మాల్స్ విస్తీర్ణం దాదాపు 1.33 కోట్ల చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా. 2022లో 57 మాల్స్ విస్తీర్ణం 84 లక్షల చదరపు అడుగులుగా ఉంది. ఖాళీగా ఉన్న మాల్స్ వల్ల దాదాపు రూ.6,700 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని తెలిపింది.
READ MORE: Air India Express: అనారోగ్యంతో సిబ్బంది… ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు రద్దు
మన హైదరాబాద్ లో మాత్రం షాపింగ్ మాల్స్ కి గిరాకీ బాగానే ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి మాల్స్‌లో గత ఏడాది ఖాళీగా ఉన్న స్థల విస్తీర్ణం 19% తగ్గి, 9 లక్షల చ.అడుగులకు పరిమితమైనట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. దేశ రాజధాని దిల్లీ (ఎన్‌సీఆర్)లో 53 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్స్ స్థలం వృథాగా ఉందట. ముంబయిలో 21 లక్షలు, బెంగళూరులో 20 లక్షల చ.అడుగుల మేర షాపింగ్ మాల్స్ స్థలమూ ఖాళీగానే ఉంది. కోల్‌కతాలో ఖాళీగా ఉన్న మాల్స్ విస్తీర్ణం 237% చేరుకుంది.
ఆదాయాలు పెరగడం, యువ జనాభా, పట్టణీకరణ కారణంగా వినియోగం అధికమవుతోంది. వ్యవస్థీకృత రిటైల్ రంగానికి ఇది అనుకూలంగా మారిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. అదే సమయంలో కొనుగోళ్ల కోసం యువత గ్రేడ్ ఎ మాల్స్‌వైపే చూస్తున్నారు. దీంతో గ్రేడ్ సి రిటైల్ కేంద్రాలు వెనుకబడిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా షాపింగ్ మాళ్లను తిరిగి కొత్తగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.