Rajahmundry Crime: రాజమండ్రిలో వైసీపీ నేత దారుణ హత్యకలకలం రేపింది. రాజమండ్రి 48వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్ బూరాడ భవాని శంకర్ ను పీతా అజయ్ కుమార్ అనే యువకుడు కత్తితో పొట్లు పొడిచి అతిదారుణంగా హత్య చేశాడు. శంకర్ ఇంటిలో భార్యతో కలిసి భోజనం చేస్తుండగా నిందితుడు అజయ్ వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసిన తర్వాత శంకర్ తో మాట్లాడాలి బయటకు రమ్మని పిలిచాడు. అయితే, గుమ్మం బయటకు వచ్చిన శంకర్ పై నిందితుడు అజయ్ కూడా తెచ్చుకున్న చాకుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. బలమైన ఆరు కత్తిపోట్లుకు గురి కావడంతో శంకర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానికుల సహాయంతో భార్య కృష్ణమాధురి.. శంకర్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవాని శంకర్ మృతి చెందారు.
హత్య చేసిన అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడిని ప్రత్యేక బృందాలతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 20 ఏళ్ల కిందట తన తండ్రి పీతా శేషును హత్య చేశాడనే నేపంతో శంకర్ ను హత్య చేసిన నిందితుడు అజయ్ పేర్కొన్నాడట.. అయితే, 20 ఏళ్లు కిందట నిందితుడు తండ్రి శేషు స్నేహితులతో కలిసి గండిపోశమ్మ తల్లి ఆలయానికి వెళ్లి వస్తుండగా అనుమానాస్పద మృతి చెందాడు.. మృతుడు శంకర్ అప్పట్లో స్నేహితులతో కలిసి శేషును హత్య చేశాడనే అభియోగాలు కూడా ఉన్నాయట.. అప్పట్లో 4 ఏళ్ల వయస్సు ఉన్న నాటి నుండి పగ పెంచుకున్న నిందితుడు అజయ్ కుమార్.. నాటి పగకు ప్రతీకారంగా ఈ రోజు హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. శంకర్ మృతి విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు.. ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని.. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు..