Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం..రూ.100 కోట్లు లూటీ

Real Estate Frauds

Real Estate Frauds

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. తాజాగా హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం బయటపడింది. జీఎస్ఆర్ (GSR) ఇన్ఫ్రా గ్రూప్.. ఫ్రీ లాంచ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. కొల్లూరు, మోకిలా, అబ్దుల్లాపూర్ మెట్టు, యాదాద్రిలో భారీ వెంచర్ల అంటూ ప్రచారం చేసింది. సంస్థ ఎండి శ్రీనివాసరావు మధ్యతరగతి ప్రజలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించాడు. 2020 నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడు సంవత్సరాలు అయినా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

READ MORE: Komatireddy Venkat Reddy: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై మరోసారి అఖిల పక్ష సమావేశం

వందలాదిమంది బాధితులు నుంచి రూ.100 కోట్ల వరకు వసూలు చేశాడు శ్రీనివాసరావు.. ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేశాడు. గత మూడు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లిస్తానంటూ కస్టమర్లకు చెప్పాడు. రెండు నెలల నుంచి కనబడకుండా పోవడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. GSR ఇన్ఫ్రా పై రెండు కేసులు నమోదు చేశారు. అలర్ట్ అయిన సంస్థ ఎండీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. బాధితులంతా సీసీఎస్ డీసీపీ శ్వేతను కలిసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Exit mobile version