NTV Telugu Site icon

Vladimir Putin: ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమే కానీ..

Putin

Putin

ఉక్రెయిన్ – రష్యా మధ్య ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. దాని వల్ల ఇరు దేశాల్లో ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు వ్యాఖ్యానించారు. తమ వైఖరిని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. కాని తమ దేశ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. గురువారం నుంచి రెండ్రోజులుగా చైనాలో పర్యటించనున్న ఆయన చైనాకు చెందిన ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘‘యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని కోరుకుంటున్నాం. ఉక్రెయిన్‌ తో చర్చల్లో- మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం, రష్యా బలగాల ఉపసంహరణ, ఖైదీల విడుదల, ఘర్షణకు బాధ్యులెవరో తేల్చేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు వంటి అంశాలు రష్యాతో యుద్ధంపై చర్చల ఎజెండాలో ఉండాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తెలపడం తెలిసిందే.

READ MORE: SRH vs GT: గుజరాత్‌తో హైదరాబాద్ ఢీ.. ప్లేఆఫ్స్‌పై సన్‌రైజర్స్‌ గురి!

ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో రష్యా దూకుడు పెంచిన నేపథ్యంలో జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పెయిన్‌, పోర్చుగల్‌ సహా మరికొన్ని దేశాలకు రాబోయే కొన్ని రోజుల్లో తాను చేపట్టాల్సిన పర్యటనలను వాయిదా వేసుకున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా 200 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీ అందించనుంది. ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్న అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ ప్యాకేజీలో దాదాపు 160 కోట్ల డాలర్ల వరకు.. అమెరికా ఇప్పటికే కేటాయించిన 6 వేల కోట్ల డాలర్ల ప్యాకేజీ నుంచే రానున్నాయి. కాగా.. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా మృత్యువాత పడుతున్నారు. శ్రీలంకకు చెందిన 16 మంది మాజీ సైనికులు మరణించారని ఆదేశ రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. ఇంకా 288 మంది లంక మాజీ సైనిక సిబ్బంది ప్రస్తుతం అక్కడి యుద్ధంలో పోరాడుతున్నారని తెలిపింది. వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొంది.