NTV Telugu Site icon

Reactor Explosion: రియాక్టర్‌ పేలుడు, ఐదుగురు మృతి.. కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

Reactor Explosion

Reactor Explosion

Reactor Explosion: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్‌ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. ఎసైన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులతో పరిశ్రమ ప్రాంగణం నిండిపోయింది.

Read Also: AP CM Chandrababu: నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి..

అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్ పేలిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు కలెక్టరుతో మాట్లాడారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అందుతున్న వైద్యంపై కలెక్టరుతో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గర ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్నారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని, 13 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని.. కలెక్టరు, ఎస్పీలు పరిస్థితి సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎంత మంది చనిపోయారో తెలియడానికి కొంత సమయం పడుతుందన్నారు. రియాక్టర్ బ్లాస్ట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని అంచనా వేశామన్నారు. కార్మిక శాఖ యంత్రాంగం అంతా అక్కడే ఉందన్నారు.