ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ యాజమాన్యం ‘డయాజియో’ ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోందట. ఆర్‌సీబీ జట్టును పూర్తిగా లేదా కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో ప్రయత్నిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. ఇప్పటికే డయాజియో ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,834 కోట్లు) ఉండొచ్చని అంచనా. అయితే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ విక్రయంపై డయాజియా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆర్‌సీబీని అమ్మెందుకు ఓ కారణం ఉందట. ఐపీఎల్‌లో పొగాకు, ఆల్కహాల్ బ్రాండ్ల ప్రత్యక్ష, పరోక్ష ప్రకటనల ప్రమోషన్‌ను నిషేధించాలని.. క్రికెటర్ల ద్వారా అనారోగ్యకరమైన ఉత్పత్తుల ప్రమోషన్‌ను ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తోంది. డయాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం ఆల్కహాల్. భారత ప్రభుత్వ నిర్ణయాలు డయాజియో వ్యాపారానికి అడ్డంకిగా మారనున్నాయి. ప్రస్తుతం సోడా, మ్యూజిక్ సీడీలు వంటి పేర్లతో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది.
డయాజియోకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. అయితే యూఎస్‌లో సుంకాలు పెరగడం, వినియోగదారులు తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడి.. కంపెనీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే నాన్ కోర్ అసెట్‌లను అమ్మేందుకు ప్రయత్నిస్తోందట. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తే డయాజియోకు మూలధనం సమకూరుతుంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలని డయాజియో చూస్తోందట. ఇక ఆర్‌సీబీ ఫ్రాంచైజీని విజయ్ మాల్యా ప్రారంభించిన విషయం తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ 2012లో భారత్ బ్యాంకులకు రుణం ఎగ్గొట్టడంతో కంపెనీ మూతపడింది. విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా డయాజియో ఆర్‌సీబీ ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో విజేతగా నిలిచిన ఆర్‌సీబీ 18 ఏళ్ల తమ నిరీక్షణకు తెరదించింది.