NTV Telugu Site icon

RCB Jersey: కుంభమేళాలో ఆర్సీబీ జెర్సీకి గంగాస్నానం, ప్రత్యేక పూజలు.. ఈ సాలా కప్ నమ్‌దే!

Rcb Jersey

Rcb Jersey

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఇప్పటివరకు టైటిల్ కొట్టని ప్రాంచైజీలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. గత 17 సంవత్సరాలుగా ఆర్సీబీ టీమ్ ట్రోఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ పోరాడుతున్నప్పటికీ.. సహచర ప్లేయర్స్ మద్దతు లేకపోవడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ టోర్నీలో అడుగుపెట్టడం.. ఒట్టి చేతులో వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలని అభిమానులు చెయ్యని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఆర్సీబీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాలో ఆర్సీబీ వీరాభిమాని ఒకరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీకి గంగాస్నానం చేయించాడు. త్రివేణి సంగమం వద్ద గంగానది పవిత్ర జలంలో ఆర్సీబీ జెర్సీని మూడుసార్లు ముంచాడు. అనంతరం ఆర్సీబీ ఈసారి క‌ప్ గెల‌వాల‌ని ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుంభమేళాలో జెర్సీకి పుణ్యస్నానాలు చేసిన అభిమాని కర్ణాటకకు చెందిన వారని సమాచారం. ఈ వీడియో చూసిన బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాలా కప్ నమ్‌దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Airtel-Jio New Recharge: ఎయిర్‌టెల్‌, జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. ఇక వారికి పండగే!

ఐపీఎల్ 2025 సీజన్‌ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవల తెలిపారు. మే 25న ఫైనల్‌ ఉంటుందని చెప్పారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది జరిగిన మెగా వేలం ద్వారా అన్ని ప్రాంఛైజీలు పటిష్ట టీంలను సిద్ధం చేసుకున్నాయి.